అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ఒక రోజు వచ్చారు అంతే. మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కేసీఆర్. కాగా కేసీఆర్.. అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై విజయ్‌పాల్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించగా.. దీనిపై మంగళవారం విచారణ జరిపింది హైకోర్టు. ఇందులో పలు అంశాలు విచారణకు వచ్చాయి.
కేసీఆర్(KCR) తన బాధ్యత మరిచారంటూ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ ప్రజల సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారని వివరించారు న్యాయవాది. కొన్ని నెలలుగా కేసీఆర్.. అసెంబ్లీకి రావడం లేదని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటించొచ్చని న్యాయవాది వివరించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. ఈ పిల్‌లో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ప్రశ్నించింది ధర్మాసనం. కాగా ఈ వ్యవహారంలో పిల్‌కు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చని, ఈ మేరకు వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటీషనర్ న్యాయవాది కోరారు. దీంతో ఈ పిల్‌పై విచారణకు న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.