ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో గిరజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. ఈ ఘటనను సుమోటోగా న్యాయస్థానం స్వీకరించింది. చీఫ్ జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద ఈ ఘటనపై లేఖ రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దీనిపై విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా డీజీపీ, హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, రాచకొండ పోలీస్ కమిషనర్, ఎల్బీనగర్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్‌లకు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాలను సమర్పించాలని ఆదేశించింది. అలాగే విచారణ రిపోర్టును తమకు అందజేయాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
మీర్‌పేటలో ఉండే వరలక్ష్మీ అనే మహిళ తన కూతురి పెళ్లి కోసం సరూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి డబ్బులు కోసం వెళ్లారు. డబ్బులు తీసుకుని తిరిగి ఆగస్టు 15 రాత్రి ఎల్బీనగర్‌కు వస్తుండగా ఎల్బీనగర్ సర్కిల్లో ఆమెను పోలీసులు ఆపారు. తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ మహిళ పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలను కొంతమంది నాయకలు పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.