తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు రిజిస్టర్ చేయబడిన అన్ని పాత వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చాలనే నిబంధనను తీసుకువచ్చింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రోడ్లపై తిరిగితే పట్టుకోవాలని పోలీసులకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నియమం ప్రకారం ఏప్రిల్ 1, 2019న లేదా అంతకు ముందు రిజిస్టర్ చేయబడిన అన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు తప్పనిసరిగా HSRPని కలిగి ఉండాలి. HSRP అనేది అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్, ప్రామాణిక నంబర్ ప్లేట్. దీనిని ఇన్‌స్టాల్ చేయడానికి 1 తేదీ సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఉండనుంది. గడువులోపు ఈ నిబంధన పాటించని వాహన యజమానులు రవాణా సంబంధిత సేవలను (యాజమాన్య బదిలీ, చిరునామా మార్పు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మొదలైనవి) కోల్పోయే అవకాశం ఉంటుంది. అదనంగా వారిపై చట్టపరమైన కేసులు, జరిమానాలు విధించవచ్చు.
HSRP ఎందుకు?
హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వాహన దొంగతనాలను నివారించడానికి సహాయపడతాయి. దేశవ్యాప్తంగా నంబర్ ప్లేట్లలో యూనిఫార్మిటీని నిర్ధారిస్తాయి. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, వాహనాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి.
HSRP కోసం ఏం చేయాలి?
మీ వాహనం ఏప్రిల్ 1, 2019 కి ముందు రిజిస్టర్ చేయబడి ఉంటే:
1. అధికారిక HSRP బుకింగ్ పోర్టల్‌ను సందర్శించండి (సాధారణంగా ప్రభుత్వ అధికారం కలిగిన విక్రేత ద్వారా అందించబడుతుంది).
2. HSRP ఇన్‌స్టాలేషన్ కోసం స్లాట్‌ను బుక్ చేసుకోండి.
3. సెప్టెంబర్ 30, 2025 కి ముందే ప్లేట్ ను సరిచేయండి.
ఏమేం డాక్యుమెంట్స్ కావాలి?
ఈ నంబర్ ప్లేట్స్ కోసం వాహనం ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి. బైకులకు రూ.320 నుండి రూ.500 వరకు, ఆటోలకు రూ.350 నుండి రూ.450 వరకు, కార్లకు రూ.590 నుండి రూ.860 వరకు, కమర్షియల్ వాహనాలకు రూ.600 నుండి రూ.800 వరకు నంబర్ ప్లేట్(Number Plates) రేట్లు ఉండనున్నాయి.