సికింద్రాబాద్ పరిధిలో మోండామార్కెట్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై(Muthyalamma Temple) ఇటీవల ఓ దుండుగుడు దాడికి పాల్పడ్డాడు. గేటును కాల్తొ తన్ని లోపలికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అప్పటి నుంచి హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు తెలుపుతున్నారు. బీజేపీ సైతం వారికి మద్దతుగా నిలిచింది. ఇటీవల బీజేపీ నేతలు పలువురు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వివరించారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తాజాగా నిందితుడిని కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CP CV Anand) తాజాగా స్పందించారు.
‘‘ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేసిన వ్యక్తి కంప్యూటర్ ఇంజినీరు. అతడు ముంబైలో ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా ఆవేశంగా ప్రవర్తించాడు. అతడిపై ముంబైలో రెండు కేసులు ఉన్నాయి. అతనికి ఆఫీసులో కూడా అన్నీ గొడవలే ఉన్నాయి. ప్రతి ఒక్కరితో గొడవపడటం అతడికి పరిపాటిగా మారిపోయింది. ఈ కేసులో ముంబై పోలీసులతో కలిసి విచారణ చేపట్టాం’’ అని సీవీ ఆనంద్(CP CV Anand) వెల్లడించారు.