Hyderabad Metro Timings: నగరవాసులు ఎదురు చూస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైంది. ఈ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ని మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. జనవరి 1 న మొదలైన నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారులు, వ్యాపారులకు సంబంధించిన ప్రొడక్ట్స్, స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. వ్యాపారుల కోసం మొత్తం 1400 స్టాల్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కాగా ఇక్కడ దుస్తుల దగ్గర నుంచి మొదలుకుని ఇంటి అలంకరణ సామగ్రి వరకు అన్ని రకాల వస్తువులు లభించనుండటంతో సందర్శకులు వేలల్లో వస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నుమాయిష్ విజిటర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.
రాత్రి వేళ మెట్రో సేవలను మరో గంట పొడిగిస్తూ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మెట్రో తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 15 వరకు మెట్రో రైళ్లు అర్ధరాత్రి 12 వరకు అందుబాటులో ఉండనున్నాయి. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ -రాయదుర్గం, నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి రైలు బయలుదేరనుంది. న్యూయర్ వేడుకల్లో సైతం మెట్రో సర్వీసులు అర్థరాత్రి వరకు నడిపించారు అధికారులు. ఇప్పుడు నుమాయిష్ సందర్భంగా మరో 45 రోజుల పాటు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు హైదరాబాదీలకు అందుబాటులో ఉండునున్నాయి. కాగా నగర ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 15 వరకు సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు నాంపల్లి ఎగ్జిబిషన్(Numaish Exhibition) వైపు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.