Hyderabad Metro Train Staff call off strike: హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది సమ్మెను విరమించారు. జీతాల పెంపు కోసం గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న సిబ్బందికి నిరాశే ఎదురైంది. వారి డిమాండ్ లలో ఒక్కటైన ట్రైన్ యాక్సిస్ మాత్రమే ఇస్తామని, అది కూడా నెల రోజుల తర్వాత ఇస్తామని మెట్రో యాజమాన్యం పేర్కొన్నారు. కానీ, జీతాలు మాత్రం పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సమ్మెను విరమించి విధులకు హాజరు కాని పక్షంలో విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. చేసేదేమి లేక విధులకు హాజరయ్యారు టికెటింగ్ సిబ్బంది.
కాగా, చాలీచాలని జీతాలతో విధులకు హాజరవుతున్నామని, ఎలాగైనా పెంచేలా చూడాలని మెట్రో సిబ్బంది యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. జనవరి 3న గత ఐదేళ్ల గా పెంచని జీతాలను 11 వేల నుండి 20 వేల కు చేయాలనే డిమాండ్ తో ఎల్ బి నగర్ – మియాపూర్ కారిడార్ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రెస్ట్ లేకుండా పని చేస్తున్నామని, తినడానికి సమయం కూడా దొరకడం లేదని వాపోయారు. తమని గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులతో మాట్లాడిన అధికారులు మెట్రో యాక్సిస్ ఇస్తామని, జీతాల పెంపుపై ఏజెన్సీ సంస్థలు, అధికారులు కాస్త సమయం కోరారు.