హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ చేపట్టారు. రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే శంషాబాద్ డీసీపీ ఆదేశానుసారం షాద్ నగర్‌లో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేశంపేట్ రోడ్, దూసకల్ క్రాస్ రోడ్, హజిపల్లి రోడ్, లింగారెడ్డి గూడ చౌరస్తాలో నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలను సీజ్ చేశారు. హెల్మెట్ లేని వాహనదారులకు చలాన్స్ విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.