Hydra Commissioner Ranganath | అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ హాలు నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్రమ కట్టడాన్ని శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీనిపై స్పందించిన నాగార్జున(Nagarjuna).. స్టే ఆర్డర్లు హైకోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. తాము చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టలేదని, చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చారు. అధికారులు తప్పుడు సమాచారంతోనో లేక చట్ట విరుద్ధం గానో కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. అధికారుల చర్యకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టం చేశారు.
ఇక నాగార్జున చేసిన ఆరోపణలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) సమాధానమిచ్చారు. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామన్నారు. హైకోర్టు స్టే ఉందనడం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి స్టే లేదని స్పష్టం చేశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేసామన్నారు. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని రంగనాథ్ తెలిపారు. గతంలోనే అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ రిక్వెస్ట్ ను తిరస్కరించారని చెప్పారు. ఎన్ కన్వెన్షన్(N Convention) అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన విడుదల చేశారు.