గ్రేటర్ పరిధిలో హైడ్రా(Hydra) చేపడుతున్న కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో పేదలైనా, పెద్దలైనా ఒకరేనని ఆయన వివరించారు. అనుమతులను బట్టే తాము కూల్చివేతలు చేపడుతున్నామని ఆయన వివరించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడం, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా ఉండేలా చూసుకోవడం హైడ్రా బాధ్యత. కాగా చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చక తప్పదని రంగనాథ్(HYDRA Commissioner Ranganath) వివరించారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.
‘‘తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా(Hydra) కూలుస్తోంది. అనుమతులు లేని ఇళ్లు పేదలవైనా, పెద్దవారివైనా కూల్చాల్సిందే. కొందరిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేస్తున్న పనికి గుర్తింపు లభించింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుంది. అందుకే కొన్నికొన్ని సందర్భాల్లో మనసు చంపుకుని పని చేయాల్సి వస్తోంది’’ అని ఆయన వివరించారు.