సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో టీసీపీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత తోపులమైనా కాటికి పోక తప్పదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. చావు అనేది ప్రాణికే తప్ప పైసాకు ఉండదంటూ జీవిత పాఠాలు నేర్పే ప్రయత్నం చేసిన ఆయన ఈ సందర్భంగానే ఓటమి ప్రతి ఒక్కరికీ ఓ మంచి పాఠం నేర్పుతుందని, మనల్ని మనకు చూపడంతో పాటు మన చుట్టూ మంచులాంటి తెరలో ఉన్న వారి నిజస్వరూపాలను చూపుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ అంతటా తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. ఆయన మాటల అంతరార్థం ఏంటా అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది.
‘‘ఎన్నికల్లో నేను చూసిన ఓటమి నాకు కూడా ఒక పాఠం నేర్పింది. నేను ఓడినా నా భార్యకు కార్పొరేషన్ పదవి దక్కడం సంతోషకరం. నా భార్య నిర్మలకు సీఎం రేవంత్ తన కోటాలోనే పదవి ఇచ్చారు. సంగారెడ్డిలో ప్రతి పండగను ఘనంంగా నిర్వహించేలా నేను చేస్తాను. జగ్గారెడ్డి అంటే బలహీనుడు, అదిరేటోడు, బెదిరేటోడు కాదు.. ఫైటర్. 1995లోనే మా మనుషులను కొట్టారన్న కోపంతో ఎస్పీ కృష్ణంరాజు కారును ఢీ కొట్టా. ఎన్నికల్లో రిగ్గింగ్ చేశా. దాదాపు 3వేల మందితో పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాం. ఎంత తోపులమైనా కాటికి వెళ్లాల్సిందే. ప్రాణికే చావు పైసాకు కాదు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో నా భార్య నిర్మల లేదా ఆంజనేయులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు’’ అని జగ్గారెడ్డి(Jagga Reddy) చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.