మంత్రి జగదీశ్ రెడ్డితో విభేదాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) స్పందించారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్ రెడ్డితో తనకు విభేదాలు లేవని అన్నారు. నా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయం అని వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తాడని తెలిపారు. వామపక్షాలతో సీట్ల పొత్తు ఖరారు అయ్యాకే అభ్యర్థుల టికెట్లపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. సొంత పార్టీలో అవిశ్వాసాలు మంచిది కాదని అన్నారు.
కాగా, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) తన వారసుడి పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గులాబీ పెద్దల ఆశీర్వాదంతో తనయుడిని ఎమ్మెల్యేను చేయాలని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సమయం లేదు బిడ్డా అంటూ కుమారుడిని స్పీడ్ పెంచేలా ప్రిపేర్ చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి(Gutha Amith Reddy).
బీఆర్ఎస్ పెద్దల ఆశీర్వాదం లభించిందని అందుకే కుమారుడిని ప్రజల్లోకి తీసుకొచ్చారనే పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం తరచూ ప్రెస్‌మీట్‌లు పెట్టి విపక్షాలను తిడుతూనే కుమారుడి టికెట్ ప్రస్తావన తీసుకొచ్చి పార్టీకి హింట్ ఇస్తున్నాడు. ఈసారి పోటీ చేయబోనని గుత్తా ప్రకటించడంతో ఆయన కుమారుడికి పార్టీ అవకాశం ఇస్తుందో లేదో చూడాలి.