రోజురోజుకూ ఇంగ్లీష్ భాషపై మోజు పెరిగి పోతూనే ఉంది. ఇంగ్లీష్ మాట్లాడటం వస్తేనే బతకగలం అనే భావన మన మెదడుల్లో బలంగా తిష్ట వేసింది. ఏం చేస్తాం మరి.. ఉద్యోగం కావాలని ఇంటర్వ్యూ కి వెళ్తే.. ముందుగా అడిగే ప్రశ్న ఇంగ్లీష్ వచ్చా అని. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అయిపోయింది. ఇంతవరకు ఓకే.. కానీ, తెలుగు మాట్లాడితే పనిష్మెంట్ తప్పదు అని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్?
తెలుగును కాపాడుకుందాం అని తెలుగు భాషా ప్రేమికులు, పండితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ తెలుగులో మాట్లాడితే శిక్షిస్తాం అనే బోర్డులు కొన్ని స్కూళ్లలో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి బోర్డును చూసి ఓ ఐపీఎస్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తెలుగు భాషపై తనకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పనిలో పనిగా ఆ బోర్డు పెట్టిన యాజమాన్యానికి చురకలంటించారు.
IPS అధికారి ట్వీట్ చేస్తూ.. ‘ఇది చూస్తే, మన తెలుగును ICUలో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా లేదు? ఏ సంస్కృతి వారైనా, కథలో, కళలో, కాజానో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. శత్రువులెక్కడో ఉండరు’ అని ట్వీట్ చేశారు. ఈ బోర్డులోనూ TELUGUకి బదులు TELGU అని తప్పుగా రాశారు. అలా ఉంది మరి తెలుగు భాష వద్దు అని రాసినవారి పరభాషా పాండిత్యం.
ఇది చూస్తే , మన తెలుగును ఐసీయు లో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా లేదూ ? ఏ సంస్కృతి వారైనా, కథలో, కళలో, కాజానో, కలంకారో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. మన బెంట్ అఫ్ మైండు లో భాష బెండు కాస్త ఎక్కువే నేమో. మాటల మాంత్రికుడన్నట్టు, శత్రువులెక్కడో ఉండరు…@Trivikramwriter pic.twitter.com/RgBKzFAnlV
— Ramesh Masthipuram (@rameshmasthi) February 22, 2023