బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించిందని జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అన్నారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని బీజేపీ(BJP)తో చేతులు కలిపానని స్పష్టంచేశారు. తనకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందన్నారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిద్దామన్నారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలతో పోరాడుతున్నానని పేర్కొన్నారు. ఏపీలో తన పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా తిరుగుతానన్నారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేనను స్థాపించానని.. పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని గుర్తుచేశారు. బీసీ సీఎంను చూడాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి రావు పద్మ(Rao Padma), ఎర్రబెల్లి ప్రదీప్‌రావు(Errabelli Pradeep Rao)ను గెలిపించాలని ఓటర్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan) విజ్ఞప్తి చేశారు.