లిక్కర్ స్కాం కేసు(Liquor Scam)లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. ఈడీ తరపున జోసెఫ్ హుస్సేన్ వాదించారు.
విచారణ సందర్భంగా కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. ఇలాంటి సమయంలో తల్లి పక్కనే ఉంటే కొంత మోరల్ సపోర్ట్ ఉంటుందన్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. లేని పక్షంలో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా అభ్యంతరం లేదని సింఘ్వి వాదించారు.
అయితే కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించాలని ఈడీ తరపు న్యాయవాది గట్టిగా వాదించారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేయగల వ్యక్తి అని తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రధాన సూత్రధారి అని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారం ఉదయానికి రిజర్వ్ చేయగా.. సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని వెల్లడించింది. కాగా మార్చి 15న లిక్కర్ కేసు(Liquor Scam)లో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.