అనుకన్నట్లే జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ సమక్షంలో జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకున్నారు. జ్ఞానేశ్వర్‌ను కేసీఆర్(KCR) సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ్ఞానేశ్వర్‌తో పాటు ఆయన అనుచరులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వర్గంలో నాయకత్వం ఎదగాలన్నారు. గెలిచే నాయకులను పార్టీ గౌరవిస్తుందని.. గెలవలేని పరిస్థితుల్లో కులాల వారీగా టికెట్లు ఇస్తే పార్టీ నష్టపోతుందని తెలిపారు.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చింతా ప్రభాకర్‌కు గత ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ ఇస్తే ఓడిపోయారని.. అయినా మళ్లీ ఇప్పుడు ఆయనకే టిక్కెట్ ఇచ్చామని చెప్పారు. దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో బీసీల రిజర్వేషన్ ద్వారా కొంత ఎదిగారన్నారు. ముదిరాజ్ సామాజికి వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎవరినీ ఎదగనివ్వలేదని ఆరోపించారు. ఆయన వెళ్లిపోయాక పెద్ద నేత అయిన జ్ఞానేశ్వర్ పార్టీలో చేరడం శుభపరిణామన్నారు. పార్టీలో మీకు తగిన గౌరవం ఉంటుందని.. ఎన్నికలు అయిపోయాక ప్రశాంతంగా అన్ని విషయాలు మాట్లాడుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) విముఖత చూపడంతో కాసాని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించానని తెలిపారు. తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్ కోరుతున్నారని.. లోకేష్(Nara Lokesh)కు 20 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని కాసాని(Kasani Gnaneshwar) వాపోయారు. తానున్నాంటూ చెప్పిన బాలకృష్ట కూడా ఫోన్ ఎత్తడం లేదన్నారు.