BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు సహా ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాబోయే వేడుకలకు వ్యూహరచన చేయడం, తెలంగాణ అంతటా పార్టీ ఉనికిని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, విజయవంతం చేయడానికి శ్రేణులంతా సమిష్టి కృషి చేయాలని సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
జనసమీకరణ, వేడుకలకు హాజరైన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్ల గురించి కేసీఆర్ చర్చించారు. వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలోని వేదిక వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS నాయకులు ఇప్పటికే భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఏప్రిల్ 27న రజతోత్సవ బహిరంగ సభ జరగనుంది. వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్ల గురించి నేతలు కేసీఆర్ కి వివరించారు.
సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు
ఎన్నికల్లో వరుస పరాజయం తర్వాత రజతోత్సవ వేడుకల ద్వారా గులాబీ దళం తమ సత్తా చాటాలని భావిస్తోంది. భారీగా క్యాడర్ సభకి హాజరయ్యేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. భారీ బలప్రదర్శనతో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే సంకేతాలను కాంగ్రెస్ కి పంపాలని చూస్తోంది. అధికార పార్టీకి ఒక సంవత్సరం సమయమిస్తామన్న కేసీఆర్(KCR).. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పై సమర శంఖారావం పూరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పై వచ్చిన వ్యతిరేకతను చాకచక్యంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. దీనికి రజతోత్సవాలే సరైన వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.