యాక్సిడెంట్ అయిన కారణంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆసుపత్రి పాలయ్యారు. ఎర్రవెల్లి లోని ఫార్మ్ హౌస్ లో ఆయన కాలు జారి కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Yashoda Hospital) వైద్యులు కేసీఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఆయనను పరామర్శించేందుకు రాజకీయ సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్తున్నారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వేలాదిగా అభిమానులు కూడా యశోద ఆసుపత్రికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల్ని ఉద్దేశించి కేసీఆర్ ఓ భావోద్వేగ వీడియోను రిలీజ్ చేశారు.
వీడియోలో కేసీఆర్(KCR) మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కేసీఆర్ ఎమోషనల్ గా మాట్లాడటం చూసి అభిమానులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. ‘‘రాష్ట్రం నలుమూలల నుంచి నన్ను చూసేందుకు వేలాదిగా తరలివస్తున్న అభిమానులకు వందనాలు. దయచేసి పది రోజుల వరకు నన్ను కలిసేందుకు ఎవరూ రావొద్దు. ఆసుపత్రిలో వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకూడదు. వారికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావొద్దని వైద్యులు చెప్పారు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకు వస్తా. కోలుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరినీ కలుస్తా. నా పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞతలు. దయచేసి సహకరించండి’’ అని పార్టీ శ్రేణులు, అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో కోసం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.