పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించనుందని చెప్పారు. ఎన్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని ఈ కూటమికే ఏదొ ఒక జాతీయ పార్టీ మద్దతు ఇస్తుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ప్రకటించారు.
తెలంగాణలో బీజేపీకి సున్నా లేదా ఒక్క సీటు వస్తుందని.. దక్షిణాదిలో 10 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంటుందని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం బీజేపీకి అలవాటు అని విమర్శించారు. బీఆర్ఎస్ పేరు మార్చబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.