తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అసలు కారణం బీఆర్ఎస్(BRS) అని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానంలో బీజేపీ(BJP) అభ్యర్థులు గెలవబోతున్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకత కారణంగా సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రసంగాలకు ఆకర్షితులై కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోలేదు. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు ప్రజలకు పదేళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 12 నెలల్లోనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు’’ అని విమర్శించారు.
‘‘కాంగ్రెస్‌ను, బీఆర్‌ఎస్‌ను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రతిపక్షం, ప్రశ్నించే గొంతు ఉండొద్దని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులను పార్టీలో చేర్చుకొని శాసన మండలిని నీరుగార్చారు. శాసన మండలిలో మేధావులు, విద్యావంతులు ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తారు. అందుకే శాసన మండలిని రాజ్యాంగ నిపుణులు ఏర్పాటు చేశారు. శాసన సభ చేసిన చట్టాలపై మేదావులైన మండలి సభ్యులు సూచనలు చేసేవారు. ప్రజల గుండె చప్పుడు వినిపించే మండలిని తన భజన చేసే సభగా కేసీఆర్(KCR) మార్చారు’’ అని Kishan Reddy ఎద్దేవా చేశారు.