Kishan Reddy Fires On Telangana Govt Over misappropriation of Grama Panchayat Funds: సీఎం కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన నిధులను డిజిటల్ కీ ద్వారా గంటల్లోనే పక్కదారి మళ్లించి దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపించారు. కేసీఆర్ మొండి వైఖరి కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆగ్రహించారు. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ లో పెట్రోల్, డీజిల్ పై 13 రూపాయల భారం పడుతుందని తెలిపారు. అత్యధిక వ్యాట్ తెలంగాణ లో ఉందని పేర్కొన్నారు. ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం వ్యాట్ ను తగించిందని.. అదేవిధంగా 23 రాష్ట్రాలు కూడా తగ్గించాయని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో లో ఎలాంటి తగ్గింపు వ్యాట్ పై చేయలేదని గుర్తు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై మరోసారి స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి. నిప్పు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చురకలంటించారు. తెలంగాణ వ్యక్తుల కోసం దర్యాప్తు ప్రారంభం కాలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తుంటే తెలంగాణ వాళ్ళ పేర్లు వచ్చాయని స్పష్టం చేశారు. కావాలనే కేంద్రం కక్ష్య కట్టింది అని ప్రచారం చేస్తున్నారని, అవి అవాస్తవాలని మండిపడ్డారు.