బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బీజేపీ కీలక నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది(Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు బైపోల్‌లో ఓటమి తర్వాత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆయన పార్టీ మారబోతున్నట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. దీంతో పార్టీ మార్పు వార్తలపై సోమవారం స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గరు జైలుకెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఒక నెలలోనే జరుగుతుందని అన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు వలసవాది అని, ఆయన తమలాంటి వాళ్ళను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తామన్నా చేర్చుకోవడం కష్టమేనని అన్నారు. ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులను చెక్ చేయాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళను మాత్రమే బీజేపీ చేర్చుకుంటుందన్నారు. తామంతా ఒక లక్ష్యం కోసం బీజేపీలో చేరినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) స్పష్టంచేశారు.