తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరబాద్‌లోని వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. సీనియర్లంతా ఎన్నికలకు రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా అధిష్టానాన్ని కోరాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పని అయిపోయిందని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామని తెలిపారు. కేసీఆర్(KCR) ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని అన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.