Komatireddy Venkat Reddy: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల అనంతరం హంగ్ వస్తుందని తాను చెప్పలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరిస్తున్నారని అన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పిందే తాను చెప్పానని గుర్తుచేశారు. రాష్ట్రంలో తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. ఇదే అదునుగా భావించిన రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. తనకు ఇప్పుడు పార్టీలో ఎలాంటి పదవులు లేవని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టానని తెలిపారు. అందులో భాగంగానే నితిన్ గడ్కరీని కలిశానని అన్నారు. మార్నింగ్ తాను చేసిన వ్యాఖ్యలను అర్థం అయ్యే వాళ్లకు అవుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హంగ్ వస్తుందంటూ వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సొంత పార్టీతో పాటు ప్రత్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.