మంత్రి కేటీఆర్‌పై వరంగల్ కాంగ్రెస్ కీలక నేత కొండా మురళి(Konda Murali) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్(KTR) వరంగల్‌లో కంపెనీలు పెడుతున్నానంటూ కొరియా నుంచి హెలికాప్టర్లు పట్టుకొచ్చాడు.. ఏడేళ్ల క్రితం కంపెనీ ఏర్పాటు చేస్తానని రైతుల నుంచి భూములు తీసుకున్నారు కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదంటూ విమర్శలు చేశారు. గుండాయిజం చేసేది కొండా మురళి కాదు బీఆర్ఎస్ నేతలే.. ఎక్కడ చూసినా భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. కొండా మురళి(Konda Murali) ప్రజలకు చేతనైన సేవ చేశాడే తప్ప గుండాయిజం చేయలేదనన్నారు. అసెంబ్లీలో పేపర్లు చింపేయడం మహబూబాబాద్‌లో రాళ్లు వేసింది మీరే.. అది గుండాయిజం కాదా? అని ప్రశ్నించారు. నేను గూండాను అంటూ విమర్శలు చేస్తున్నారు. నేను గూండానైతే నన్ను పిలిచి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు? నేను గుండానే నా ఇంటికి వచ్చి కేసీఆర్(KCR) ఎట్లా భోజనం చేశారు..? అని ప్రశ్నించారు. పరకాల నుంచి పోటీ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని.. దీని గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు.