వేములవాడ(Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయ కోడెలు అక్రమ రవాణాకు గురవుతున్నాయని, అందులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హస్తం కూడా ఉందన్న వార్తలు కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. స్వామి వారి కోడెలను మంత్రి అక్రమంగా అమ్ముకుంటున్నారా అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. తాజాగా ఈ వార్తలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.
ఇవన్నీ కూడా భోగస్ వార్తలని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడం కోసమే కొందరు ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజన్న కోడెల పంపిణీ ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పిస్తున్న కోడెల సంఖ్య పెరుగుతుండటంతో వాటి నిర్వహణ భారంగా మారిందని, ఈ క్రమంలో అనేక కోడెలు మరణించాయని ఆమె గుర్తు చేశారు.
‘‘భక్తులు సమర్పించే కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం ఆరు నెలల క్రితం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు ఇతర సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ కోడెల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారమే జీవోను విడుదల చేశాం. వాటిని అనుసరిస్తూనే పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, సంబంధిత మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రం ఉన్న వారికే కొడెలను పంపిణీ చేశాం.
కోడెల(Kodelu) పంపిణీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. అన్ని పత్రాలను నిబందనలకు అనుగుణంగా ఉంటేనే ఆ రైతుకు రెండు కోడెల సంరక్షణ బాధ్యతలు అప్పజెప్పాం. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశాం. ఈ క్రమంలో కోడెలను అక్రమంగా విక్రయించారని వస్తున్న వార్తలన్నీ కూడా కట్టుకథలు, అవాస్తవాలే’’ అని ఆమె(Konda Surekha) కొట్టిపారేశారు.
‘‘సాధారణంగా మా వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలన కోసం సంబంధిత అధికారులకు పంపుతుంటాం. కోడెల పంపిణీకి సంబంధించిన దరఖాస్తులను కూడా అదే విధంగా పంపాం. దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదు. వేములవాడ ఆలయంలో ప్రతి కోడెలకు శాశ్వత ట్యాగ్ ఉంటుంది. అటువంటి ట్యాగ్‌లు ఉన్న కోడెల ఎక్కడ పట్టుబడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తోందని అసత్య ప్రచారం చేస్తూ సమాజాంలో అశాంతిని సృష్టించాలని చూస్తున్న అసాంఘిక శక్తులను వెతికి పట్టుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.