క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, బీజేపీ కీలక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారని.. అయితే ఆమె అరెస్ట్ కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన వుందని ప్రజలు అనుకున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దీని వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేక్‌లు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ – బీఆర్ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని ప్రజలు అనుకుంటున్నారని, ఇది బీజేపీకి తెలంగాణలో పెద్ద సంకటంగా మారిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ విచిత్రమైన సంకట స్థితిలో వుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలతో కలిసి కొందరు నేతలు పార్టీ పెడతారనేది అవాస్తవమన్న ఆయన.. రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ ఆలోచన చేస్తే కేసీఆర్(KCR) పురిటిలోనే చంపేస్తారని అభిప్రాయపడ్డారు. అంతేగాక, కర్ణాటక(Karnataka) ఫలితాలు కాంగ్రెస్‌కు బలాన్ని చేకూరుస్తాయి కానీ, విజయాన్ని ఇచ్చేంత కాదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలిపారు.
Read Also: ‘ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు’
Follow us on: Google News, Koo, Twitter