హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP Vivekanand) ఆరోపించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఏమి లేదని ఆయన అన్నారు. గత సంవత్సరం నుండి “కాపీ – పేస్ట్ బడ్జెట్” ను ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివేకానంద విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో హైదరాబాద్ అభివృద్ధి కుంటుబడిపోయిందని ఎమ్మెల్యే అన్నారు. నగరంలోని సీసీ టీవి లు పనిచేయడం లేదు, అదేవిధంగా 40 శాతం స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. తమ ప్రభుత్వం, బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్ ల గురించి కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని ఆయన ఎగతాళి చేసారు. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరం నాలుగు వైపులా నిర్మించ తలపెట్టిన 4 మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విస్మరించారని ఆయన మండిపడ్డారు. రాయదుర్గం – విమానాశ్రయం మార్గంలో మెట్రో విస్తరణ పై ఎలాంటి పురోగతి లేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కంటే భూ ఒప్పందాలపై ఎక్కువ దృష్టి పెట్టిందని కేపీ వివేకానంద ఎద్దేవా చేసారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ ను దక్కించుకుంది. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తుందని, బడ్జెట్ లో కేటాయింపులు కూడా తక్కువగా చేసిందని దుయ్యబట్టారు. ఫోర్త్ సిటీ ప్రాజెక్ట్ ముసుగులో ప్రభుత్వం భూ ఒప్పందాలను ముందుకు తెస్తోంద వివేకానంద ఆరోపించారు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు ఐటీ ఉద్యోగాలు 2 లక్షల నుండి 10 లక్షలకు పెరిగాయని ఆయన చెప్పారు. అదేవిధంగా ఐటీ ఎగుమతులు రూ.57,000 కోట్ల నుండి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయని వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడానికి బదులుగా ఢిల్లీకి నిధులు సమకూర్చేందుకు ప్రాధాన్యత ఇస్తుందని వివేకానంద(KP Vivekanand) పేర్కొన్నారు.