KTR – Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆ భూమిని వేలం వేయాలని నిర్ణయించినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఆ భూముల్లో చెట్లు నరికివేత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ప్రతిపక్షాలు, పర్యావరణ ప్రేమికులు, వివిధ ఎన్జీవోలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఆ భూముల్లో ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ వెంటనే నిలిపివేయాలని స్టే విధించింది. అలాగే సెంట్రల్ ఎంపవర్ కమిటీని నియమించి, కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై రెండురోజుల క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, ప్రతిపక్షాలు కంచె గచ్చిబౌలి భూముల అమ్మకంతో రేవంత్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపిస్తున్నాయి. దీనిపై శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్‌ని తుంగలో తొక్కి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడన్నారు. ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి బదిలీ చేశాడు కానీ మ్యుటేషన్ చేయలేదన్నారు.
బీజేపీ ఎంపీ సాయంతో రేవంత్ భారీ స్కామ్ -KTR
రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి, లేని వాల్యూను ఉన్నట్లు చూపించి RBIని మిస్ లీడ్ చేసి స్కాం చేశాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. తనది కాని భూమిని TGIICతో తాకట్టు పెట్టి, రేవంత్ రెడ్డి రూ.10000 కోట్లు తెచ్చుకున్నాడని ఆరోపించారు. HCU భారీ కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ అండగా నిలిచారని బాంబు పేల్చారు.
“ఒక బీజేపీ ఎంపీ, ఒక బ్రోకరేజ్ కంపెనీ సహకారంతో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డ రేవంత్. ఆ భూముల మీద టీజీఐఐసీకి ఎటువంటి ఓనర్‌షిప్ రైట్స్ లేకున్నా ఆ భూములను తాకట్టు పెట్టింది. హెచ్‌సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసమే కాదు.. రూ. 10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగింది. ఈ భూ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే. భూ యాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే పది వేల కోట్ల లోన్ ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు తన క్రెడిబిలిటీని కోల్పోయింది. త్వరలోనే ఆ బ్యాంక్ కుప్పకూలడం ఖాయం. ఈ స్కాంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ప్రధాని మోడీ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.