హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్ రావు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కౌశిక్ రెడ్డిపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే.. మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం అని కేటీఆర్, హరీష్ రావులు హెచ్చరించారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఇరువురూ విమర్శించారు. “కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలి” అని కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy).. ప్రభుత్వం దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ శనివారం హుజురాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆందోళనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. ఆయన అస్వస్థతకి గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.