మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. ఆటోవాలాగా మారారు. అసెంబ్లీకి ఖాకీ చొక్కా వేసుకుని స్వయంగా ఆటో తోలుకుంటూ వచ్చారు. ఆయనతో పాటు పలువురు ఇతన నాయకులు కూడా అదే ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగానే బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఖాకీ చొక్కాలు వేసుకుని శాసనసభకు విచ్చేశారు.
ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం ఏమాత్రం సమంజసం కాదని కాంగ్రెస్‌కు హితవుపలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లకు బలవన్మరణాలకు పాల్పడ్డారని, అవన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలేనని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ కడుపు కొడుతుందంటూ రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేల ఆర్థిక సహాయం చేస్తామంటూ కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. వారు ప్రశ్నించిన ప్రతిసారి వారికి ఏవేవో కబుర్లు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపి వారి నిరసనలు విరమించుకునేలా చేస్తోందని, కానీ వారికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ఏమీ లేదంటూ మండిపడ్డారు కేటీఆర్(KTR).
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 93 మంది ఆటో డ్రైవర్లను(Auto Drivers) కాంగ్రెస్ పొట్టనపెట్టుకుందని, ఆ కుటుంబాలకు ప్రభుత్వమే ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే వరకు తమ నిరసన ఆగదని, ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అబద్ధపు హామీలను అరచేతిలో వైకుంఠం చూపారని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ ఓట్ బ్యాంక్‌గానే చూసింది తప్ప.. వారిని ప్రజలుగా, సాటి పౌరులుగా గుర్తించలేదని, అందుకే వారి పట్ల ఇంతటి నిర్లక్ష దోరణి కనబరుస్తోందని ధ్వజమెత్తారు.