ఎస్ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలు దాస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రమాదం గురించి ముందుగానే సమాచారం ఉందన్నారు. రెండు నివేదికలు ఈ ప్రమాదాన్ని హెచ్చరించాయని, అయినా కాంగ్రెస్ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి, నిర్లక్ష్య ధోరణితో కాంగ్రెస్ ముందుకు సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టన్నెల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి.
కానీ, కమీషన్లకు కక్కుర్తి పడే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పనులను కొనసాగించింది. ఆ నివేదికల్లో చెప్పినట్లే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కూలీ పనులు చేస్తున్న ఎనిమిది మంది కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నం అయ్యాయి. వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఈ ప్రమాదానికి సీఎం రేవంత్(Revanth Reddy)తో పాటు, మంత్రులంతా బాధ్యత వహించాలి. రెండు నివేదికల అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్రమాదం జరుగుతుందని నివేదికలు హెచ్చరించినా.. కాంగ్రెస్ ఎందుకు పనులను కొనసాగించింది? నివేదికలను ఎందుకు నిర్లక్ష్యం చేసింది? అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ బదులివ్వాలి’’ అని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.