సిరిసిల్ల(Sircilla) జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్(KTR)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తానని.. లేదంటే లేదన్నారు. అంతేకాని ఓట్లు కోసం మందు పోయానని, పైసలు పంచనని.. గతంలోనూ ఇలా చేయలేదని స్పష్టంచేశారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కేసీఆర్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రానికి ఎలాంటి ఢోకా లేదని తెలిపారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను చెప్పి వారిని నిలదీయాలన్నారు. విపక్షాలు సలహాలు ఇస్తే పెన్షన్ పెంచలేదన్నారు. ఇప్పుడు ఆరువందల మందికి పెన్షన్ ఇస్తే వార్త కాదని ఆరుగురికి రాకుంటే వార్త అవుతోందన్నారు.
తెలంగాణలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) ఇచ్చామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా తొమ్మిది రకాల పథకాలను అమల్లోకి తెచ్చామన్నారు. బీసీ బంధు అంటే లోన్ కాదని సర్కార్ ఇస్తున్న గ్రాంట్ అన్నారు. దళితుల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. పేదల మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇతరులకు ఎవ్వరికీ లేదన్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గృహలక్ష్మి పథకం రూ.3లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని కేటీఆర్(KTR) వెల్లడించారు.