రుణమాఫీ విషయంలో యు టర్న్ తీసుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్న రుణమాఫీలు మంజూరు చేయబడవని ప్రభుత్వం ప్రకటించడంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నాయకులు పూర్తి పంట రుణమాఫీని అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
“ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు- పెట్టెలో ఓట్లు పడ్డాయ్-జేబులో నోట్లు పడ్డాయ్-ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం” అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ(Crop Waiver) అని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అని.. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారని దుయ్యబట్టారు. నాడు ఓట్ల కోసం హామీలు ఇచ్చి నేడు ఎగవేత కోసం కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్(KTR).. “మిస్టర్ రాహుల్, మాఫీమాంగో తెలంగాణసే. జాగో తెలంగాణ జాగో!” అంటూ స్లోగన్ ఎత్తుకున్నారు.