ఉచిత బస్సులు, మహిళలపై నిన్న కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారాయి. మహిళలను పట్టుకుని అలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ కేటీఆర్‌పై ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోవడంతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితి కేటీఆర్ మానసిక స్థితి చేరుకుందంటూ కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.”బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. అందుకే బస్సులు పెట్టరేమో మాకు తెలియదక్కా. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా. ఒక్కో మనిషికి ఒక్కో బస్సు పెట్టండి. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డ్ డాన్స్ లు వేసుకోమనండి… మాకేంటి? అదనంగా బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
అయితే మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదంటూ తన వ్యాఖ్యలకు జస్టిఫికేషన్ ఇచ్చారు కేటీఆర్(KTR). ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని స్పష్టం చేశారు.