గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు చెప్పుకు ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ చేత కూడా చెప్పించుకోవడం దారుణమన్నారు. రైతులకు రుణమాఫీ ఎక్కడ చేసిందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో 30శాతం మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. కానీ, పూర్తి రుణమాఫీ జరిగిందని గవర్నర్ చేత చెప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్(Revanth Reddy) సొంత నియోజకవర్గంలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. కేసీఆర్(KCR) మీద కోపంతో మేడిగడ్డను ఎండగట్టారని, మేడిగడ్డను రిపేర్ చేస్తాం, పంటలను కాపాడతాం అని ఒక్క మాట కూడా అనలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలకు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి 25శాతం కమిషన్ తీసుకోవడం తప్ప విజన్ ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తే.. మంత్రి వెనకదారి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారంటూ KTR చురకలంటించారు.