కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది నేతన్నల మగ్గాలను ఆపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు అప్పుల పాలయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల చేతులకు మళ్ళీ ఉరితాళ్లను చేతికిచ్చిందంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నేతన్నలను రాజాల్లా ఉన్నారని, బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి కూడా కల్పించామని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బతుకమ్మ చీరలను ఆపేసింది నేతన్నలను అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. నేతన్నల కడుపు కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నల మగ్గాలను మళ్లీ ఆపింది! కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలను అప్పులపాలు జేసింది!
కాంగ్రెస్ వచ్చింది.. నేతన్నలకు మళ్లీ ఉరితాడునిచ్చింది!
బతుకమ్మ చీరలతో నేతన్నలకు కేసీఆర్(KCR) ఉపాధితో కల్పిస్తే.. కాంగ్రెస్సోల్లు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసేందుకు నేతన్న కడుపు కొడుతుండ్రు!
కేసీఆర్ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలపై విపరీతమైన కక్ష మీ రాజకీయానికి అనాధలైన ఈ బిడ్డలకేది తల్లిదండ్రుల రక్షా!
తల్లిదండ్రుల చెంత అల్లారుముద్దుగా పెరగాల్సిన ఈ బిడ్డలను అనాధలు చేసిన పాపం ఊరికే పోదు.. ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది!
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటూ మా గోరటి వెంకన్న పాడిన సాలెల మగ్గం సడుగులిరిగినయ్ అనే పాట కాంగ్రెస్ పాలనలో మళ్లీ యాదికొస్తుంది’’ అని కేటీఆర్(KTR) తన పోస్ట్‌లో పేర్కొన్నారు.