బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar).. ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. కాగా, ఈ చర్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. జగదీష్ రెడ్డి సస్పెండ్‌ను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ నేతలంతా అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. ‘‘జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటలు అన్నట్లుగా కావాలనే చిత్రీకరించారు.
నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు ఆయనను సస్పెండ్ చేయడం దారుణం. తాను చేసిన తప్పేంటో అడిగే అవకాశం కూడా జగదీష్ రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలి. సభ సజావుగా జరగడానికి సహకరించాలి. ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబుకు(Sridhar Babu) స్పష్టంగా చెప్పాం. అయినా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడించి మా ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తున్న ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు’’ అని కేటీఆర్(KTR) అన్నారు.