తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ఆంధ్రా పాలకుల చేతిలో ఇన్నాళ్లూ ఏ విధమైన మోసం జరిగిందో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధిని మీకే అర్ధం అవుతుందని మంత్రి వెల్లడించారు.
అంతేగాక, కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయాలని, కోరగా తానూ మంజూరు చేసినట్లు తెలిపారు. సౌమ్యుడైన గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి పనులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అనేక రోడ్లు కావాలని అడిగారు.. అడిగిన వన్నీ చేసి పెట్టామని గుర్తుచేశారు.