కొడంగల్(Kodangal)లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ రేవంత్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. అది నోరా.. మూసీ నదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది నోరైతే మాటలు వస్తాయని, అదే మూసీ నది అయితే మాయమాటలే వస్తాయంటూ రేవంత్(Revanth Reddy)ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రేవంత్ తన పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో యావత్ తెలంగాణను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు ఫార్మా సిటీ(Pharma City) నిర్మిస్తామని గప్పాలు చెప్పి.. ఇప్పుడు ప్రజలు తిరగబడే పరిస్థితులు రావడంతో నాలుక మడపెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను, చర్యలను తమ పార్టీ ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటుందని, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ మేరతకు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఘాటైన పోస్ట్ ఒకటి పెట్టారు.
‘‘కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసమే అని నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ స్పష్టంగా వెల్లడిస్తుంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా? ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా? ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్.
చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు’’ అంటూ కేటీఆర్(KTR) పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే కొడంగల్‌లో ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టింది. దీనిపైనే కేటీఆర్ ఫైరయ్యారు.
Read Also: పెళ్ళి పీటలెక్కనున్న తమన్నా.. వరుడు అతడే..!