తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), కేటీఆర్(KTR) మధ్య మాటలయుద్ధం జరిగింది. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో కేసీఆర్ ఎందుకు రాలేదు? అని సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతల్ని నిలదీశారు. ఈ నాయకుడి స్థాయికి మేము చాలు, కేసీఆర్ వచ్చినా, రాకున్నా మాకు సమాధానం చెప్పే సత్తా ఉంది. మేము అడిగేవాడికి మీరు సమాధానం చెప్పండి చాలు అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇక బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు మేము సంపూర్ణ మద్దతిస్తున్నాం అని కేటీఆర్ చెప్పారు.
అయితే, ప్రభుత్వం తీర్మానం అని చెబుతూ దాని కాపీలను మాత్రం మాకు ఇవ్వలేదు అన్నారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ… కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా అనుకున్నా కానీ ఆయన అంతకంటే దారుణమని నిరూపించుకున్నారని విమర్శించారు. నేను స్పష్టంగా సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ కోసం అనుమతి అడిగాను… కానీ తీర్మానం పెట్టారు, అనుమతి ఇవ్వలేదు అని తప్పుదోవపట్టిస్తున్నారు. కేటీఆర్ సమయానికి రారు, లేట్ గా వచ్చి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతూ.. సీరియస్ ఇష్యూ ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు మేము సంపూర్ణ మద్దతిస్తున్నాం. ముఖ్యమంత్రికి సంయమనం, ఓపిక ఉండాలి.. నన్ను మేనేజ్‌మెంట్ కోటా అంటున్నారు. నేను కూడా పేమెంట్ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చు. అయ్యా, తండ్రి కోటా అంటే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అంటున్నారా? రాజీవ్ గాంధీని అంటున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము తెలంగాణ ప్రజల పక్షమే. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేము ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం అని కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.