తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప బీసీల జీవితాల్లో మార్పు మాత్రం రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. బీసీ హక్కులను సాధించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీపై ఉందని, మన హక్కులను మనం సాధించుకుని తీరాలని ఆయన పిలుపునిచ్చారు. మసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల బతులు మారాలని అన్నారు.
‘‘తెలంగాణ ఏర్పాటులో బీసీలు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర సాధనకోసం అహర్శిశలు శ్రమించారు. ఈ విషయంలో అందరినీ అభినందించాల్సిందే. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు జరిగిన మేలు ఏమీ లేదు. మన హక్కులను మనం అడగాలి. సాధించుకోవాలి. ఈ సమావేశంలో నాకు తెలిపిన అన్ని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. సర్దార్ సర్వాయి పాపన్న(Sardar Sarvai Papanna Goud) జయంతి రోజు చెప్పా.. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన పూర్తి చేస్తాం. గల్లి నుంచి ఢిల్లీ వరకు బలహీన వర్గాల న్యాయవాదులు ఏకం కావాలి. జీవితం సార్ధకం కావాలంటే మన హక్కుల కోసం పోరాడాలి’’ అని ఆయన(Ponnam Prabhakar) పేర్కొన్నారు.