Revanth Reddy | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలే నీటమునిగిపోగా.. అనేక మంది వరదల్లో గల్లంతు అయ్యారు. రోడ్లు పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అంతేగాక, హైదరాబాద్ నగరాన్ని వరదలు కుదిపేశాయి. చిన్న వర్షానికే చిన్నాభిన్నం అయ్యే హైదరాబాద్‌లో వరుసగా వారంరోజుల పాటు వర్షాలు పడటంతో పరిస్థితి దారుణంగా మారింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్ బాస్, మల్కా్‌జ్‌గిరి(Malkajgiri) ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి అనూహ్య పరిణామం ఎదురైంది. వరదలు నియోజవర్గాన్ని కుదిపేస్తున్నా తమ ఎంపీ పత్తా లేకుండా పోయారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాదు.. మా ఎంపీ మిస్సయ్యారు అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు అండగా ఉండి.. అవసరాలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధి వ్యక్తిగత, రాజకీయ స్వలాభం కోసమే పనిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.