Keesara ORR | రోజు రోజుకు మానవత్వం మసకబారుతోంది. తోటి వ్యక్తికి సహాయం చేయడం అన్న కాన్సెప్ట్‌ను సాటి మనుషులు మరుస్తున్నారు. ఇందుకు కీసరలో చోటు చేసుకున్న ఒక ఘటన అద్దం పడుతోంది. మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. కాపాడమని వేడుకుంటున్నా ఎవరూ కనికరించకుండా ఓ వ్యక్తి ప్రాణాలు బలితీసుకుంది. దీనిని చూసిన మానవతా వాదులంతా ఈ సమాజం ఎటుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో కూడా సాటి మనిషికి సాయం చేయడం ప్రత్యేక క్లాసులు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని, ఇది సమాజానికి ఏమాత్రం మేలు చేయదని మానవతా వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. కీసర(Keesara) ఔటర్ రింగ్ రోడ్డు మీద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్‌కు చెందిన వీ ఎలేందర్(35).. కీసరలో నిర్మిస్తున్న ఇంటిని చూడటానికి వెళ్తున్న క్రమంలో అతని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. స్థానికులు కేకలు వేయడంతో లారీ డ్రైవర్.. లారీని రివర్స్ చేశాడు. దీంతో లారీ చక్రాలు.. బాధితుడి కాళ్లపై నుంచి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయి తీవ్ర రక్తస్రావం కాసాగింది. ఆ బాధలోనూ తనను ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ బాధితుడు ఎలేందర్.. స్థానికులను వేడుకున్నాడు. కానీ స్థానికులు మాత్రం 108కు సమాచారం అందించి ఉండిపోయారు. పైగా ఫొటోలు, వీడియోలు తీస్తూ బాధితుడిని అదే స్థితిలో ఉంచేశారు. కొద్ది సేపటికి అంబులెన్స్ వచ్చి ఎలెందర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే బాధితుడు మరణించాడు. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు.