బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) నివాసం, కార్యాలయాల్లో నిన్నటి నుంచి తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఇంటి ముందు ఆయన అనుచరులు, బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు పెద్ద ఎత్తును ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక ఆరోపణలు చేశారు. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఐటీ అధికారులు(IT Officials) బూతులు తిట్టడమే కాకుండా, చేయి కూడా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలు చేయడానికి వచ్చి ఉద్యోగులపై చేయిచేసుకోవడం ఏంటని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు వ్యాపారాలు చేయకూడదా?అని ప్రశ్నించారు. తమ సహనాన్ని అధికారులు పరీక్షించవద్దని.. హద్దు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాను ఇప్పటికే రూ.150కోట్ల ఆదాయపు పన్ను కట్టానని.. తనకు ఐటీ శాఖ నుంచి అవార్డు కూడా వచ్చిందని ఆయన(Marri Janardhan Reddy) గుర్తుచేశారు. మరోవైపు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.