మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ(CMR College) హాస్టల్ లో విద్యార్థినిల ఆందోళన కొనసాగుతోంది. బాత్రూంలో రహస్యంగా కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో కాలేజీలో ఉధృత వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎంఆర్ కాలేజీ(CMR College) వ్యవహారం పై విచారణ చేపట్టి తక్షణమే నిందితులకు కఠిన శిక్ష విధించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హాస్టల్లో వంట చేసే వారిపై పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
బాత్రూం గోడల పైన ఉన్న వేలిముద్రలను సైతం పోలీసులు సేకరించినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రూ. లక్షలు పోసి కాలేజి ఫీజులు చెల్లిస్తున్నా తమ పిల్లలకు రక్షణ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.