గాంధీభవన్‌లో జరుగుతున్న ప్రజావాణి(Prajavani) కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ(Damodara Raja Narasimha) హాజరయ్యారు. ఇదే విధంగా ఇకపై బుధ, శుక్రవారాలు జరిగే ప్రజావాణికి ఎవరో ఒక మంత్రి కచ్ఛితంగా హాజరవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు.. ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలవడం చాలా ముఖ్యమని భావించే పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పెద్ద పీట వేయాలని, ఏమాత్రం అలసత్వం కనబరిచినా ఊరుకునేది లేదని ఆయన అధికారులను సూచించారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రజావాణి(Prajavani) పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. వంద ఫిర్యాదులు వస్తే వాటిలో కనీసం పది కూడా పరిష్కారం కావడం లేదని, దానికి తోడుగా ఫిర్యాదులపై రివ్యూలు కూడా జరగడం లేదనంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతోనే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని గ్రహించి.. టీపీసీసీ చీఫ్(TPCC Chief) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఇదే అంశంపై మాట్లాడి వారంలో రెండు రోజులు ఎవరో ఒక మంత్రి గాంధీ భవన్‌కు వచ్చి ప్రజావాణిలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అందుకు సమ్మతించిన సీఎం రేవంత్.. అదే విధంగా ఆదేశాలు జారీ చేశారు.