టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. తాను భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా కు సిద్ధమని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్(Revanth Reddy) ఒక బ్లాక్ మెయిలర్ అని, మోసాలతో డబ్బులు సంపాదించిన ఆయన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ చంద్రబాబుకు రేవంత్ ఏజెంట్‌గానే పనిచేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ కోసం తాను జైలుకు కూడా వెళ్లానన్నారు. రేవంత్, జంగా రాఘవరెడ్డిలది బ్లాక్ మెయిల్ జీవితం అని, వీళ్లది తనను, సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాదన్నారు. రేవంత్ జీవితమంతా బ్లాక్ మెలింగే అని ఆరోపించారు. ఒకేచోట పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతో ప్రతిసారీ వేర్వేరు ప్రాంతాల్లో రేవంత్ పోటీ చేస్తాడని సెటైర్లు వేశారు. అంతేగాక, కేసీఆర్‌పై పిచ్చికూతలు కూయడం బంద్ చేయాలని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు వార్నింగ్ ఇచ్చారు.