Minister Errabelli Dayakar Rao Visits his Agriculture Land: మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పొలం దున్ని, జానపదాలు ఆలపిస్తూ నాట్లు వేశారు. స్థానిక రైతు కూలీలతో కలిసి సెల్ఫీలు దిగి, మాటామంతీ కలిపారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మంత్రి తమతో కలిసి పొలం పనులు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇంతకీ మంత్రి చేనులో దిగి పొలం దున్ని, నాటు వేయడం వెనుక విశేషం ఇదే.
మంత్రి ఎర్రబెల్లి(Minister Errabelli Dayakar Rao) తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా పర్వతగిరిలోని సొంత భూమిలో జరుగుతున్న వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు వెళ్లారు. పొలం పనులు చూసేందుకు వెళ్లిన మంత్రి స్వయంగా పొలం పనులు చేయడం మొదలుపెట్టారు. అరక చేబూని ఎడ్లను అయిచ్చితూ పొలం దున్నారు మంత్రి. జానపద పాటలు ఆలపిస్తూ నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో గొంతు కలిపి సందడి చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్నవారు ఎప్పుడూ నష్టపోరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని కూలీలతో చెప్పారు. తెలంగాణలోని కోటి ఎకరాలను మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అపర భగీరథుడిగా కేసీఆర్ దేశ ప్రజలచే ప్రశంసలు పొందుతున్నారని కొనియాడారు. అనంతరం అక్కడున్న రైతు కూలీలు మంత్రితో సెల్ఫీలు తీసుకున్నారు.