Minister Harish Rao:వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు, చేనేతపై జీఎస్టీ విధింపుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కృష్ణా, గోదావరి జలాలను ఎత్తిపోసే పనిలో నిమగ్నం అయితే.. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే పనిలో ఉన్నారంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మధ్యవర్తులుగా ఉన్నవారిని కోన్ కిస్కా గాళ్లు అన్న బీజేపీ వాళ్లు.. కేసును సీబీఐకు అప్పగించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని నిలదీశారు. చండూరులో సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కావటంతో.. బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేదన్నారు.
65 లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విషయంలో 30 వేల కోట్లు ఇస్తామని తెలంగాణ ఆర్థికశాఖకు కేంద్రం లేఖ రాసినా సీఎం కేసీఆర్ తిరస్కరించారని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao)పేర్కొన్నారు. బీజేపీ డీఎన్‌ఏలోనే అబద్ధాలు ఉన్నాయని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏమిటో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఢిల్లీ దూతలు చెప్పారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని హరీష్ రావు అన్నారు. మిషన్ భగీరథకు 19200 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా.. కేంద్రం నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఫ్లోరైడ్ నిర్మూలనకు ఎనిమిది వందల కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల వాటా తేల్చాలని కేంద్రానికి ఇరవై ఉత్తరాలు రాసినా.. స్పందన లేదని మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: మునుగోడుకు తరలిస్తుండగా పట్టుబడిన డబ్బు