Harish Rao |పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్‌లో చేపట్టిన ఆందోళనలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ఆదానీ, అంబానీలకు దేశ ప్రజల సంపదను మోడీ దోచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను మోడీ ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోందని ఆవేదన చెందారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ నిరుపేద ఇల్లూ సంతోషంగా లేదని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.